కరోనా నేపథ్యంలో చాలా మంది ఆల్కహాల్ ఉండే శానిటైజర్లను వాడుతున్న సంగతి తెలిసిందే. అనేక మంది హ్యాండ్ వాష్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక రకాల హ్యాండ్ శానిటైజర్లలో 50 శాతం శానిటైజర్లు నకిలీవేనని తేలింది. ఈ మేరకు కన్‌జ్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీజీఎస్ఐ) ముంబైలో 120 రకాల హ్యాండ్ శానిటైజర్లను టెస్ట్ చేసి వివరాలను వెల్లడించిది. వాటిల్లో 50 శాతం శానిటైజర్లలో కల్తీ జరిగినట్లు గుర్తించింది. ఇక ఆ శానిటైజర్లలో 4 శాతం వాటిలో నిషేధిత విష పదార్థం మిథైల్ ఆల్కహాల్‌ను వాడారని నిర్దారించింది.
సాధారణంగా శానిటైజర్లను ఈథైల్ ఆల్కహాల్‌ను వాడి తయారు చేయాల్సి ఉంటుంది. మిథైల్ ఆల్కహాల్ ను వాడడాన్ని నిషేధించారు. అయితే సీజీఎస్ఐ గుర్తించిన కల్తీ శానిటైజర్లలో మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ఎక్కువ కాలం పాటు వాడితే అంధత్వం వస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇదే విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేస్తామని సీజీఎస్ఐ స్పష్టం చేసింది.
కరోనా నేపథ్యంలో చేతులను శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అయింది. అందులో భాగంగానే జనాలు చాలా మంది గతంలో కన్నా ఇప్పుడే ఎక్కువగా హ్యాండ్ శానిటైజర్లను వాడుతున్నారు. అయితే ఇదే విషయాన్ని అదునుగా చేసుకుని కొందరు హ్యాండ్ శానిటైజర్లను కల్తీ చేస్తున్నారని, వాటిని మార్కెట్‌లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని సీజీఎస్ఐ సెక్రెటరీ డాక్టర్ ఎంఎస్ కామత్ తెలిపారు.
సాధారణంగా మనం సబ్బు లేదా హ్యాండ్ వాష్ లేదా హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవచ్చు. అయితే శానిటైజర్లలో కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉండాలి. కానీ కల్తీ అయిన హ్యాండ్ శానిటైజర్లలో ఆల్కహాల్ అస్సలు ఉండడం లేదు. పైగా నిషేధిత మిథైల్ ఆల్కహాల్‌ను ఉపయోగించి శానిటైజర్లను తయారు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని సీజీఎస్ఐ వ్యాఖ్యానించింది. వినియోగదారులు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.