ఢిల్లీలో 2012లో నిర్భయపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులకు ఇది వరకే మూడు సార్లు డెత్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే దోషులు చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని విడివిడిగా పిటిషన్లు వేస్తూ ఉరిశిక్ష వాయిదా పడేలా చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారికి తాజాగా మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. అయితే శిక్షకు ఇంకా రెండు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో దోషులను ఉరి తీసే తలారి సింధీ రామ్ అలియాస్ పవన్ జల్లాద్ ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్నాడు.
మంగళవారం రాత్రి తలారి సింధీ రామ్ తీహార్ జైలుకు చేరుకున్నట్లు జైలు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా బుధవారం సింధీ రామ్‌చే డమ్మీ ఉరిశిక్షను నిర్వహించనున్నారు. బొమ్మలకు ఉరి వేసి ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నామని జైలు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిర్భయ దోషులకు మార్చి 20వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరి అమలు కానుంది. ఇక నలుగురు దోషులను వరుసగా నిలబెట్టి దోషుల్లో ఒకడైన పవన్ గుప్తాను ముందుగా ఉరి తీయనున్నారు. తరువాత మిగిలిన ముగ్గురినీ ఉరి తీస్తారు.
కాగా తలారి పవన్ జల్లాద్‌కు 5 మంది కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి మమ్మూసింగ్, తాత కల్లు జల్లాద్, ముత్తాతలు కూడా తలారులుగానే పనిచేశారు. అయితే దోషుల్లో ఒకడైన ముకేష్ సింగ్ తాజాగా ఢిల్లీ కోర్టులో మరొక పిటిషన్ వేయడం, మరోవైపు మిగిలిన ముగ్గురు దోషులు తమకు ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇదివరకే జరిగాయి. ఈ క్రమంలో ఉరిశిక్ష మరోసారి రద్దవుతుందా, లేదా అన్నది సందేహంగా మారింది..!