బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పందించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల సూత్రధారి బండి సంజయ్ అని ఆరోపించారు. ప్రజలు అసహ్యించుకునేలా కమలం నేతల తీరు ఉందని మండిపడ్డారు. పేపర్ లీకుల సూత్రధారులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. బండి సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. పదో తరగతి పేపర్ లీకేజీపై బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘బీజేపీవి దిగజారుడు రాజకీయాలు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలా? దమ్ముంటే రాజకీయంగా కొట్లాడండి. పిల్లల జీవితాలతో, భవిష్యత్‌తో ఆటలాడతారా. పట్టపగలు స్పష్టంగా దొరికిన దొంగ బండి సంజయ్. బీజేపీ క్షుద్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. పేపర్ లీకేజీ నిందితుల విడుదల కోసం బీజేపీ నేతలు ధర్నా చేశారు. పసి పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. అధికారం కోసం ఏదైనా చేసేందుకు కమలం నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బీజేపీకి గుణపాఠం చెప్పాలి. కాషాయ నేతలకు చదువు విలువ తెలియదు.’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.