బీజేపీ మరోసారి విమర్శలు గుప్పించారు వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నాలుగేండ్ల క్రితం వచ్చిన మెడికల్ కాలేజీకి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారట.. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి ఇప్పుడు కొబ్బరి కాయ కొడతారట అని విమర్శించారు. ఒక్క మెడికల్ కాలేజీకి నాలుగేళ్ల తర్వాత కొబ్బరి కాయ కొడితే.. మేం గతేడాది ఒకే సారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరికాయలు కొట్టామని.. ఈసారి 9 కొట్టబోతున్నాం.. మరి మేమంత చెప్పుకోవాలని ప్రశ్నించారు. బీజేపీది పని తక్కువ.. ప్రచారం ఎక్కువ.. అంతా డబ్బు కట్టుకోవడమే అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ది చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. పనిచేసి ప్రజల హృదయాలు గెలుచుకోవాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని తెలిపారు.
కంటి వెలుగు పథకం కోటి పరీక్షల మైలు రాయిని అధిగమించిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. గ్యాస్ ధర ఎందుకు పెంచారని నిర్మలా సీతారామన్‌ను మహిళలు నిలదీస్తే సమాధానం చెప్పలేక వెళ్లిపోయారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 40 ఏండ్లు కాంగ్రెస్, 20 ఏండ్లు టీడీపీ అధికారంలో ఉండి ఎందుకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. 60 ఏండ్లలో వాళ్లు చేయలేనిది 8 ఏండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. అల్లావుద్దీన్ ద్వీపం లేదు.. కానీ కేసీఆర్ అనే అద్భుత ద్వీపం మన దగ్గర ఉందని అన్నారు.