Harish Rao:తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు లేఖ రాశారు. లక్నోవేదికగా శుక్రవారం జరిగిన 45 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, గ్రాంట్ల గురించి లేఖ రాశారు.
పన్నుల వాటా, వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించే గ్రాంటు, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2020-21 సంవత్సరానికి గానూ తెలంగాణకు రూ.723 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఐజీఎస్టీ నిధుల విషయాన్ని కూడా ప్రస్తవించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.13,944 కోట్ల ఐజీఎస్టీ నిధులను రాష్ట్రాలకు కేటాయింపులు జరగలేదని తెలిపారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ.281 కోట్లు, పన్నుల వాటా కింద మరో రూ.71 కోట్లు.. మొత్తం రూ.352 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.142 కోట్లు మాత్రం అందాయి. ఇంకా రూ.210 కోట్లు విడుదల చేయాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు.
అలాగే.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీ ప్రకారం.. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం కేటాయించే గ్రాంటు కింద రాష్ట్రానికి రెండేళ్లకు గానూ రూ.900 కోట్లు రావాల్సి ఉందనీ గుర్తు చేశారు. తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పడగా.. ఇందులో 32 జిల్లాలు వెనకబడినవేనని, ఈ నేపథ్యంలో వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే గ్రాంటును మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు .. కాటన్‌పై ఆర్‌సీఎంను రద్దు చేయాలని మంత్రి హరీశ్‌రావు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు.