తెలంగాణ అభివృద్ధికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి , శ్రీ జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, సీఆర్పీఎఫ్ మరియు సీఐఎస్ఎఫ్ యొక్క కంటెంజెంట్స్ ద్వారా గార్డ్ ఆఫ్ హానర్‌ను సమీక్షించారు.
అయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన దత్తాత్రేయ.. తాను హైదరాబాద్‌లో ఉన్న విషయం తెలిసి కూడా తనను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమంలో తాను చుకురుగా పాల్గొన్నానని.. తాను ఓ ఉద్యమకారుడినే కాక ప్రస్తుతం ఓ రాష్ట్రానికి గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తినని అన్నారు. అలాంటిది తనను గుర్తించకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.