హైడెన్‌ సిక్‌ ఆడుకుంటూ దేశం దాటిన బాలుడు.. వారం రోజుల తర్వాత చూస్తే..

-

ఆడుకుంటూ దేశం దాటిపోయాడు ఓ బాలుడు.. ఆశ్చర్యంగా అనిపిస్తుందా.. చిన్నప్పుడు మనం కూడా దొంగా పోలీస్‌, హైడ్‌ అండ్‌ సిక్‌ లాంటి ఆటలు ఆడేవాళ్లం.. ఎవరికీ కనిపించకుండా దాక్కోవాలి.. అలా దాక్కోనే ఆ బాబు ఏకంగా దేశం దాటిపోయాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
బంగ్లాదేశ్‌కు చెందిన బాలుడు ఎండీ రతుల్‌ ఇస్లామ్‌ ఫహిమ్‌ ఓ పోర్టు ఏరియాలో నివసిస్తున్నాడు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ సమీపంలోని కంటైనర్‌లో దాక్కున్నాడు. దాంతో స్నేహితులు ఎంత వెతికినా దొరకలేదు. కంటైనర్‌లో సరకు లేకపోవడంతో పోర్టు సిబ్బంది దాన్ని పూర్తిగా తనిఖీ చేయకుండానే.. క్రేన్‌ సహాయంతో ఓడలోకి ఎక్కించారు. ఆ ఓడ మెల్లగా రేవును వీడి మలేసియా బయల్దేరింది. సముద్రమార్గంలో ప్రయాణం సాగిస్తూ మలేసియా చేరింది. ఆ తర్వాత కంటైనర్‌లో నుంచి చిన్న చిన్న శబ్దాలు రావడం గుర్తించిన ఓ ఉద్యోగి లోపల ఎవరో ఉన్నారని సహచరులకు చెప్పాడు. తలుపులు తీసి చూడటంతో ఫహిమ్‌ కనపడ్డాడు. అప్పటికే వారం రోజులు కావడంతో సరైన తిండి, నీరు లేక ఆ బాబు నీరసించి పోయాడు. లోపల వెలుతురు కూడా లేకపోవడంతో తన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది..
ఈ విషయం తెలియడంతో మలేసియాలోని క్లాంగ్‌ జిల్లా అధికారులు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు, మెరైన్‌ పోలీసులు పోర్టు దగ్గరకు వచ్చారు. పిల్లవాడు బాగా బలహీనపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తొలుత ఫహిమ్‌ను మానవ అక్రమ రవాణా ముఠా తీసుకొచ్చిందేమోనని పోలీసులు, అధికారులు అనుమానించారు. కానీ విచారణలో అందుకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదు. విచారణలో అక్రమ రవాణా కాదని తేలినట్లు అసిస్టెంట్ కమిషనర్‌ చా హూంగ్ ఫోంగ్‌ తెలిపారు.
మలేసియా ఇంటీరియర్‌ మినిస్టర్‌ సైఫుద్దీన్‌ నసూషన్‌ బాలుడికి సంబంధించిన విషయాలను ట్వీట్‌ చేశారు. ఫహిమ్‌కు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందజేశామని, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అందుకు సహాయం చేశాయని చెప్పారు. బంగ్లాదేశ్‌ హై కమిషనర్‌తో మాట్లాడి చిన్నారిని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మొత్తానికి బాలుడు
 స్వదేశానికి చేరుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version