అరటి పండు.. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవ్వరికైనా అరటి పండు అంటే ఇష్టమే. లొట్టలేసుకుంటూ తింటారు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు కావాలంటే మాత్రం అరటి పండును లాగించేయాల్సిందే. అరటి పండ్లలోనూ చాలా రకాలు ఉంటాయి. మన దగ్గర దొరికేవి.. చక్కెరకేళి, అమృతిపాణి లాంటి రకాల అరటి పండ్లు. అయితే.. అసలు అరటి పండ్లు ఎందుకు తినాలి.. వాటిలో ఉండే పోషకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండులో ఐరన్, కాల్షియం, పొటాషియం, కేలరీలు, పీచు పదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ ఏ, బీ, సీ పుష్కలంగా ఉంటాయి. ఒక్క అరటి పండులోనే ఇన్ని రకాల పోషకాలు ఉంటాయి. అంటే.. మీరు ఒక అరటి పండు తిన్నారంటే.. ఇవన్నీ మీ ఒంట్లో చేరినట్టే. చూశారా? 5 రూపాయలు పెడితే దొరికే అరటి పండు ద్వారా ఎన్ని పోషకాలు శరీరంలోకి చేరుతాయో.
ఏ సీజన్‌లోనైనా దొరికే పండు ఇది. దీంట్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. తక్షణ శక్తి కోసం కూడా అరటి పండును తినొచ్చు. కండరాల బలహీనత ఉన్నవాళ్‌లు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు, ఎసిడిటీతో బాధ పడుతున్నవాళ్లు, అల్సర్‌తో బాధ పడుతున్న వాళ్లు, డయేరియా, మలబద్ధకం, నిద్రలేమితో బాధపడేవాళ్లు అరటి పండును తమ జీవితంలో భాగం చేసుకోవాలి.