ఉత్తర చైనా షాంగ్సీ ప్రావిన్స్‌లోని జొంగ్‌యాంగ్ కౌంటీపై ప్రకృతి విలయం సృష్టించింది. కుండపోత వర్షాలతో ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం మధ్య కుండపోతగా కురిసిన వర్షంతో జొంగ్‌యాంగ్ కౌంటీలోని ప్రజలు బెంబేలెత్తిపోయారు. పర్వత ప్రాంతం నుంచి భారీగా వరదలు పోటెత్తాయి. దీంతో ఇళ్లు, రోడ్లు, పంటలను ధ్వంసమయ్యాయి. ప్రవాహా ఉద్ధృతికి కార్లు కొట్టుకుపోయాయి. పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి.
జొంగ్‌యాంగ్ కౌంటీ ప్రాంతంలో 13 గంటల పాటు కుండపోత వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. కౌంటీకి సమీపంలోని జిన్లువో గ్రామంలో అత్యధికంగా 20 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కురిసిన వర్షాల్లో ఇదే అత్యధికమని వివరించారు. వరద ప్రవాహం నుంచి అక్కడి రహదారులు కోలుకుంటున్నాయి. రోడ్లపైకి భారీగా బురద వచ్చి చేరడం వల్ల అధికారులు తొలగిస్తున్నారు.
ప్రకృతి విపత్తు అనంతరం.. పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు జొంగ్‌యాంగ్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్యూరో డైరెక్టర్ లియు హుయ్ చెప్పారు. పర్వత ప్రాంతాల నుంచి సంభవించిన వరదల్లో ఐదుగురు రహదారి నిర్మాణ కార్మికులు కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు రానున్న మూడు రోజుల్లో జొంగ్‌యాంగ్ కౌంటీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ ప్రాంత వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.