ఏపీలో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా ప్రాంతాలు, పరిసర జిల్లాల్లో సోమవారం అంటే ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో తూర్పు/ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం తూర్పు భూమధ్యరేఖ ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది.
దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉంటుంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదిలి, నైరుతి బంగాళాఖాతం మీదుగా ఇవాళ్టికి అల్పపీడనంగా మరింత బలపడి ఫిబ్రవరి 1 నాటికి శ్రీలంక తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో మంగళవారం ఒకటి,రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల పొగ మంచు సంభవించే అవకాశం ఉంది. అలాగే ఇవాళ, మంగళ, బుధవారాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.