టాలీవుడ్ నుంచి ఇప్పటికే పలువురు నటీనటులు వైకాపా కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు హేమ కూడా వైకాపా తరుపున పార్టీ ప్రచారంలో తిరిగింది. జగన్ ను కలిసి మెడలో కండువా కూడా వేయించుకుంది. అయితే పూర్తి స్థాయి రాజకీయాలలో పాల్గొనలేదు. తాజాగా ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక రాజకీయాలలోనే కొనసాగుతానని రాజమండ్రిలో జరిగిన ఓ మీడియా సమావేశంలో వెల్లడించింది. ప్రస్తుతం జగన్ పాలన అద్భుతంగా ఉందని… జగన్ తండ్రి బాటలో పయనిస్తూ వైఎఎస్ ఆర్ పాలన అందిస్తున్నారంది. రాజమండ్రిలో ఇల్లు కట్టుకుంటున్నానని, ఇకపై తన నివాసం రాజమండ్రి అని తెలిపింది.
అలాగే కాపుల కోసం జగన్ రెండు వేల కోట్లు కేటాయించడం అభినందనీయమని ప్రశంసించారు. కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కూడా త్వరగా అమలు పరచాలని కోరారు. ఆమె మాటలను బట్టి హేమ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే తెలుస్తోంది. హేమకు కొన్నాళ్లుగా పెద్దగా అవకాశాలు రావడం లేదు. చిన్న చితకా పాత్రలు తప్ప! స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకోవడంలో విఫలమైంది. ఆ మద్య ఓ సందర్భంలో దర్శకుడు త్రివిక్రమ్ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. తన పారితోషికం విషయంలో త్రివిక్రమ్ తల దూర్చడం ఏంటని? ఆయన్ని ఘాటుగానే విమర్శించింది. నిజానికి త్రివిక్రమ్ సినిమాలతోనే ఆమె ఫేమస్ అయింది. ఆమెలో ట్యాలెంట్ ను గుర్తించి తనకు తగ్గ పాత్రలు ఇచ్చారు.
కానీ ఆయనపైనే విమర్శలు చేయడంతో హేమ కెరీర్ క్లోజ్ అయినట్లే నని అప్పుడే కథనాలు వచ్చాయి. ఇక శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో `మా`లో కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగింది. ప్రస్తుతం నరేష్ అధ్యక్షతన ఏర్పాటైన నూతన కార్యవర్గంలోనూ ఆమె యాక్టివ్ గా ఉంది. అయితే అక్కడా ఆమెకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మా ఆఫీస్ కు కూడా వెళ్లడం లేదని తెలిసింది. కట్ చేస్తే ఇలా భవిష్యత్ లో రాజీలేని రాజకీయాలు చేస్తానని ప్రకటించింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.