కేరళ..అనగానే ముందు గుర్తుకువచ్చేది ఆ కొబ్బిరిచెట్లు, ఎటు చూసిన పచ్చదనం. ప్రకృతి అందాలకు నెలవు కేరళ. ప్రసిద్ద పర్యాటక ప్రాంతం కేరళ. సంస్కృతి, ఆహారం, దుస్తులు దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉన్నప్పటికీ కాస్త ప్రత్యేకత అయితే ఉంటుంది.. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా పేరుగాంచింది. ఆ ఆలయం ప్రత్యేకత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.విష్ణు ఆలయం మొత్తం ఆస్తులు సుమారు 22 బిలియన్లు. ఈరోజు కేరళ ప్రత్యేకతలను కొన్ని తెలుసుకుందాం.
ప్రపంచ ప్రఖ్యాత కథకళి నృత్యం కేరళదే..కేరళ శాస్త్రీయ నృత్యం ప్రధానంగా పురుషులు ప్రదర్శిస్తారు. కేరళలో ఉన్న కొచ్చి నౌకాశ్రయాన్ని అరేబియా సముద్రపు రాణి అని పిలుస్తారు.. కొచ్చి ఓడరేవు నుంచి చాలా సుగంధ ద్రవ్యాలు యూరోపియన్ దేశాలతో వర్తకం చేయబడ్డాయి. దేశం మొట్టమొదటి మసీదు కేరళలోని కొడుంగళూరు ప్రాంతంలో నిర్మించారు. క్రీ.శ 629లో నిర్మించిన ఈ మసీదు దేశంలో మొదటి పురాతన మసీదు.
బంగారు ఆభరణాలపై కేరళ ప్రజలకు మక్కువ ఎక్కువ. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం బంగారంలో 20 శాతం బంగారాన్ని కేరళ మాత్రమే వినియోగిస్తుంది. కవలలు కేరళలోని మలప్పురం జిల్లాలోని కొడిన్హి గ్రామంలో ఎక్కువగా జన్మించారు. ఒక లెక్క ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జన్మించిన వెయ్యి మంది పిల్లలలో 4 మంది పిల్లలు కవలలు. కానీ కోడిన్హి గ్రామంలో 1000 మంది పిల్లలలో 45 మంది కవలలు జన్మించారు.
మన ఏరియాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం తర్వాత ఎప్పుడెప్పుడు వానలు పడతాయాని ఎదురుచూస్తాం..కానీ కేరళ ప్రజలు అత్యంత అదృష్టవంతులనే చెప్పాలి.. ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే రుతుపవనాలు మొదట కేరళను ముంచెత్తుతాయి. కేరళలో సాధారణంగా జూన్ 1 న నైరుతి రుతుపవనాలను అందుకుంటుంది.
– Triveni Buskarowthu