వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఒక దాని వెనుక ఒకటి వచ్చి పడుతుంటాయి. ఈ క్రమంలో ఆయా సమస్యల నుంచి తప్పించుకోవడం కష్టతరమవుతుంటుంది. ఇక చివరకు ఏదో ఒక రోజుకు ఎవరైనా చనిపోక తప్పదు. అయితే ఎక్కువ కాలం బతకాలనుకునేవారు మాత్రం నిత్యం తక్కువ ఆహారం తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ మేరకు కొందరు సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనలు సదరు విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
అమెరికా, చైనాలకు చెందిన కొందరు సైంటిస్టులు ఎలుకలపై ఇటీవలే పలు ప్రయోగాలు చేశారు. కొన్ని ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. వాటిలో కొన్నింటికి సాధారణ ఆహారం ఇచ్చారు. కొన్నింటికి మొదటి గ్రూపు కన్నా 30 శాతం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం ఇచ్చారు. అంటే ఆ ఎలుకలు నిత్యం తినాల్సిన దానికన్నా తక్కువ ఆహారం తిన్నాయన్నమాట. ఈ క్రమంలో కొన్ని రోజుల తరువాత వాటిలోని పలు అవయవాల కణాల పనితీరును పరిశీలించారు. చివరకు వెల్లడైందేమిటంటే.. నిత్యం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకున్న రెండో గ్రూప్‌నకు చెందిన ఎలుకల్లో ఆయా అవయవాల కణాలు క్షీణించే రేటు తక్కువైందట. అంటే ఆ కణాల వయస్సు చాలా నెమ్మదిగా పెరిగిందట. ఆ కణాలు చాలా ఎక్కువ రోజుల పాటు జీవించి ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో నిత్యం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువ రోజుల పాటు బతకవచ్చని సైంటిస్టులు తేల్చారు.
కాగా సైంటిస్టులు చేపట్టిన సదరు పరిశోధనకు చెందిన వివరాలను సెల్ అనే ఓ జర్నల్‌లోనూ ప్రచురించారు. ఈ క్రమంలో సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. నిత్యం చాలా తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం పాటు జీవించవచ్చని, అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని, మెటబాలిజం క్రమబద్దీకరింపబడుతుందని అంటున్నారు..!