ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఇబ్బంది పెడుతోందని అన్నారు వెంకట్రామిరెడ్డి. శుక్రవారం అమరావతిలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరయ్యారు గ్రామ వార్డు సచివాలయ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులు, మీడియా తీరు పై వెంకట్రామిరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.
కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని.. కొన్ని వ్యవస్థలు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. గతంలో నిమ్మగడ్డ రమేష్ ఎలా వ్యవహరించారో చూశామని అన్నారు. జడ్జీలను ఎవరో దూషించారని మూడు నెలలు బెయిల్ ఇవ్వకుండా చేశారని.. మరి రోజూ సీఎంని దూషించే వారి పై ఆ కోర్టులు ఎందుకు స్పందించటం లేదు? అంటూ ప్రశ్నించారు. జూన్ 30 నాటికి అర్హత ఉన్న ఉద్యోగులందరి సర్వీసులు పర్మినెంట్ చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
జూలై 1 తర్వాత అర్హత పొందిన ఉద్యోగుల సర్వీసులనూ పర్మినెంట్ చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని అన్నారు. సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్ లో విజయవాడలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భారీ సభ ఉంటుందని..సభలో సీఎం జగన్ ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించామన్నారు. బదిలీలకు సంబంధించి అడిగితే సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు.కరోనా టైంలో ఎంతో కష్టపడి పనిచేశారని..ఆ టైంలో 196 మంది కరోనాతో చనిపోయారని అన్నారు వెంకట్రామిరెడ్డి.
వారందరికీ ప్రభుత్వ సాయం అందించేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్ కి మానసపుత్రిక లాంటిదని అంన్నారు. ఈ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆయన స్పందిస్తున్నారని కొనియాడారు. మంచిచేసే ప్రభుత్వం మనకి ఉంది..అలాంటి ప్రభుత్వం ఆదేశాలని మనం సక్రమంగా పని చేద్దామన్నారు.అలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నారు.