ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడుగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి రాజధాని మీద విచారణ పూర్తి అయ్యే వరకు కూడా రాజధానిని తరలించ వద్దని ఆ రాష్ట్ర హైకోర్ట్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారి చేసింది. ఇక రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటి వద్ద పెండింగ్ లో ఉంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
రాజధానిని తరలించడానికి గాను ప్లాన్ బీ ఆయన అమలు చేస్తున్నట్టు సమాచారం. శాసన సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ విధంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. తాను విశాఖ వెళ్తే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అక్కడికే వస్తుంది. కీలక శాఖల అధికారులు అందరూ అక్కడికే వస్తారు కాబట్టి ముందు తాను అక్కడికి వెళ్ళే యోచన చేస్తున్నారు.
త్వరలోనే ఆయన విశాఖ వెళ్ళడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలు శాఖలకు కూడా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే పలు కార్యాలయాల కోసం అధికారులు విశాఖలో వెతుకులాట మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఆంధ్రా యునివర్సిటి భవనాలు, పోర్ట్ గెస్ట్ హౌస్, కొన్ని కార్పోరేట్ కాలేజీలు, రుషికొండ సమీపంలో సముద్ర తీరానికి ఆనుకుని ఒక హోటల్ నిర్మాణం జరుగుతుంది, అందులో కొంత భాగం,
తిమ్మాపురం సమీపంలో బావికొండ దిగువన ముఖ్యమంత్రికి శాశ్వత కార్యాలయం ఇలా ఏపీ ఉన్నతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. డీజీపీ కార్యాలయం కోసం మధురవాడ పరిసరాల్లో కొన్ని భవనాలు, ఏయూలో కాళీగా ఉండి విశాలంగా ఉన్న ఉపకులపతి, రిజిస్ట్రార్ భవనాలు ప్రభుత్వ కార్యాకలాపాల కోసం తీసుకునే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఉగాదిలోపు ఇది జరిగే అవకాశం ఉంది.