వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పలు అనుమానాలను కోర్టు లేవనెత్తింది… ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే కేసును రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేస్తున్నారని ప్రశ్నించింది. కేసును ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థకు కేసును ఎందుకు బదిలీ చేయలేదో కారణాలు తెలియజేస్తూ పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో విచారణ జరిపించాలని.. కేసును ఏపీ పోలీస్ పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జగన్‌పై జరిగిన దాడికి అన్‌లాఫుల్ ఎగినెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్3(ఏ) కింద కేసు నమోదు చేయాలి.. కానీ పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టించేందుకు సెక్షన్ 307 కింద నమోదు చేశారని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి , ప్రతిపక్ష నేతకు సరైన భద్రత కల్పించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు.