కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చడం లేదంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక్కరోజు ‘ధర్మ పోరాట దీక్ష’ జరిగింది. అయితే, దీనికి రూ. 10 కోట్లు ఖర్చు కావడంపై ఏపీ హైకోర్టు హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఒక్కరోజు ధర్మాకు ప్రజాధనాన్ని పది కోట్లు వెచ్చించారా? అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్షపై తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సూర్యనారాయణరాజు హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
అయితే కేవలం రాజకీయ లబ్ది కోసం పదికోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని పిటీషనర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో, రూ. 10 కోట్లను కేటాయిస్తూ జీవో జారీ చేసిన అధికారి ఎవరని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమకు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. కేసును వచ్చే నెల 21వ తేదీకి విచారాణను వాయిదా వేసింది.