జమ్మూకాశ్మీర్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అగ్రనేతలు భావించారు. ఆర్టికల్ 370 తర్వాత జరిగిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఆశతో ఉన్నారు. కానీ అనుకోకుండా అక్కడి ప్రజలు కాంగ్రెస్, ఎన్సీ కూటమికి పట్టం కట్టారు. అయినప్పటికీ జమ్ముకాశ్మీర్‌లో కాంగ్రెస్, ఎన్సీ కంటే బీజేపీకి ఓటు షేర్ ఎక్కువగా వచ్చింది. మరోవైపు 29 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇదిలాఉండగా, జమ్మూకాశ్మీర్‌లో తమకు పట్టున్న రెండు స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. హిందూ ఓటర్లు అధికంగా ఉన్న బానీ, రాంబన్ నియోజకవర్గాల్లో ఓటమిని చవిచూసింది. బానీ స్థానంలో బీజేపీ అభ్యర్థి జెవాన్ లాల్‌పై స్వతంత్ర అభ్యర్థి రామేశ్వర్ సింగ్ ఏకంగా 18,672 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాంబన్‌లో ఎన్సీ అభ్యర్థి అర్జున్ సింగ్ 8,869 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆ రెండు స్థానాల్లో బీజేపీ గెలుపొందింది.