పడని ఆహార పదార్థాలు తినడం, కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం.. ఇలా అనేక కారణాల వల్ల మనలో చాలా మందికి అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ అవుతుంటాయి. అవి వచ్చాయంటే ఇక ఒక పట్టాన తగ్గవు. ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే వాటిని తగ్గించుకోవడం కోసం ఇంగ్లిష్ మెడిసిన్‌లనే వేసుకోవాల్సిన పనిలేదు. మన ఇళ్లలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే లూజ్ మోషన్స్ ను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
* దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల జీర్ణాశయం, పేగుల్లో ఉండే గ్యాస్ బయటకు వెళ్లిపోయి సమస్య కొంత వరకు తగ్గుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణాశయంలో ఇర్రిటేషన్‌ను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క పొడిని నేరుగా తీసుకోవచ్చు. లేదా నీటిలో కలిపి తాగవచ్చు. లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఉపయోగమే ఉంటుంది.
* జీలకర్ర జీర్ణాశయం, పేగుల్లో ఉండే గ్యాస్, ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. అజీర్ణ సమస్య నుంచి బయట పడవచ్చు. జీలకర్రను నేరుగా తిన్నా లేదా కషాయం తీసుకున్నా లూజ్ మోషన్స్ తగ్గుతాయి.
* లూజ్ మోషన్స్, అజీర్ణం సమస్యలు ఉంటే లవంగాలను తినాలి. దీని వల్ల అసిడిటీ కూడా తగ్గుతుంది. లవంగాలను నేరుగా తినవచ్చు లేదా పొడి రూపంలోనూ తీసుకోవచ్చు.
* లూజ్ మోషన్స్, అజీర్ణం సమస్యలకు అల్లం కూడా చక్కగా పనిచేస్తుంది. కొద్దిగా అల్లం రసాన్ని తాగినా లేదా దాంతో తేనె కలిపి తీసుకున్నా ఉపయోగం ఉంటుంది. అలాగే గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా తగ్గుతాయి.
* తులసి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల జీర్ణాశయం, పేగులు శుభ్రంగా మారుతాయి. అసిడిటీ తగ్గుతుంది. లూజ్ మోషన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులు కొన్నింటిని తీసుకుని నేరుగా తినవచ్చు. లేదా రసం తీసి తాగవచ్చు.
* కొబ్బరి నీళ్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో ఇర్రిటేషన్‌ను తగ్గిస్తుంది. లూజ్ మోషన్స్ తగ్గుతాయి. అజీర్ణ సమస్య నుంచి బయట పడవచ్చు.
* అరటిపండ్లలో ఉండే పొటాషియం, విటమిన్ బి6, ఫోలేట్‌లు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, లూజ్ మోషన్స్ ను తగ్గిస్తాయి. కనుక ఆయా సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకుంటే మంచిది.