స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో తమ ప్రభుత్వం తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు సీఎం జగన్. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చాం..ఇంకా ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. రూపాయి లంచం తీసుకోకుండా 2.7 లక్షల మంది వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేశామని.. ప్రతి 2000 మందికి పౌర సేవలు అందించే విధంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నట్లు తెలిపారు.
విత్తనం నుంచి పంట వరకు రైతులకు సేవలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయన్నారు. పాలన వికేంద్రీకరణ కోసం అదనంగా 13 జిల్లాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసాతో 52 లక్షల రైతు కుటుంబాలకు ఏటా 13,500 రూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని.. పగటి పూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణం పూర్తి అయిన తరువాత ఒక్కో ఇంటి విలువ కనీసం 7 నుంచి 10 లక్షల రూపాయలు ఉంటుందని.. పెత్తందారీ పోకడలను అడ్డుకోవటానికి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయించామని.. ఈ మూడేళ్లలో విద్యా రంగంలమ మీద 53 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు సీఎం జగన్.