లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే దేశంలో ఢిల్లీ నుంచి అనేక ప్రాంతాలకు రైలు సర్వీసులను నడుపుతున్న సంగతి తెలిసిందే. కేవలం కన్‌ఫాం అయిన టిక్కెట్లు ఉన్న ప్రయాణికులను.. అది కూడా కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణం చేసేందుకు అనుమతినిస్తారు. దీంతోపాటు పలు నిబంధనలను కూడా రైళల్లో, స్టేషన్లలో ప్రయాణికులు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే ప్రయాణికులకు అసలు కష్టాలు ఎదురవుతున్నాయి.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు రైళ్లనైతే నడుపుతున్నారు కానీ.. రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వెళ్లాలన్నా.. రైలు దిగి స్టేషన్ నుంచి ఇంటికి రావాలన్నా.. ఇతర ప్రజా రవాణా సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులో లేవు. ఉన్న ఆటోలు, క్యాబులు ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక స్టేషన్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక సొంత వాహనాలు లేదా బంధువులకు చెందిన వాహనాలు ఉన్నవారు వాటిల్లో రైల్వే స్టేషన్లకు రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఎటొచ్చీ ఆ వాహనాలు లేని వారికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రయాణికుల కోసం ఆర్టీసీ సదుపాయాన్ని అందుబాటులో ఉంచితే బాగుంటుందని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వాలు ఈ విషయంలో ఏం చేస్తాయో చూడాలి..!