ఆన్‌లైన్‌లో ఎలా యాసిడ్‌ అమ్ముతారు..? ఫ్లిప్‌కార్ట్‌, మీషోలోలకు కేంద్రం నోటీసులు

-

దేశరాజధాని దిల్లో రోజూ ఏదో ఒక మూల నేరాలు జరుగుతూనే ఉన్నాయి.. ఒక్క దిల్లీలోనే కాదు.. దేశంలోనూ పరిస్థితి అలానే ఉంది. ప్రేమించి మోసం చేసేవాళ్లు ఒకవైపు ఉంటే.. ప్రేమించలేదని పగతీర్చుకునేవాళ్లు మరోవైపు. దిల్లీలో 17 ఏళ్ల బాలికపై జరిగిన యాసిడ్ దాడి ఘటన యావత్‌ దేశాన్ని ఆందోళనకు గురిచేసింది.. నిందితులను పట్టుకోని విచారిస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ దాడికి పాల్పడ్డవారు ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ కొన్నట్టు తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వినియోగదారుల వ్యవహారాల విభాగానికి చెందిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై గట్టి చర్యలు తీసుకుంది. సమాజంలో పెరుగుతున్న నేరాల నేపథ్యంలో, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు CCPA రంగంలోకి దిగింది. రెండు ఇ-కామర్స్ సంస్థలకు CCPA నోటీసులు పంపింది. ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫాష్‌నియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (meesho.com) ప్లాట్‌ఫామ్‌లలో యాసిడ్ అమ్మకాలకు సంబంధించి ఈ నోటీసుల్ని పంపింది. 7 రోజుల్లోగా వివరణాత్మకంగా స్పందించాలని ఈ సంస్థలను ఆదేశించింది. అవసరమైన డాక్యుమెంట్స్‌తో తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. అంత ప్రమాదకరమైన వాటిని ఇంత తేలిగ్గా ఎలా ఆన్‌లైన్‌లో ఉంచుతారని నిలదీసింది.
భారతదేశంలో వినియోగదారుల ప్రయోజనాలను పర్యవేక్షించే CCPA, ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత ప్రమాదకరమైన యాసిడ్స్ అమ్మకాలను గుర్తించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో యాసిడ్‌లు సులభంగా, నియంత్రణ లేకుండా లభించడానికి ప్రశ్నించింది. ప్రమాదకర యాసిడ్స్ సులభంగా లభించడం ప్రజలకు ప్రమాదకరని, సురక్షితం కాదని తెలిపింది. ప్రజలపై యాసిడ్ దాడులను నిరోధించడానికి, ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స, పునరావాసం కోసం తీసుకోవలసిన చర్యల గురించి 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను మరోసారి గుర్తు చేసింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్లాంతాలు యాసిడ్ అమ్మకాలను నియంత్రించాలని ఇప్పటికే కేంద్రం నుంచి గైడ్‌లైన్స్ జారీ అయ్యాయి. అయినప్పటికీ.. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తమ ఉత్పత్తులను దేశం నలుమూలలా డెలివరీ చేస్తున్నాయి. వీటి తనిఖీ కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరాలను కోరింది.
మీషో ప్లాట్‌ఫామ్‌లో కూడా ప్రమాదకర యాసిడ్స్ లభిస్తున్నట్టు CCPA పరిశీలనలో తేలింది. సుప్రీం కోర్టు ఆదేశాలను, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాను ఉల్లంఘించి అటువంటి యాసిడ్‌లను విక్రయిస్తున్నట్లు సీసీపీఏ గుర్తించింది. ఈ ఇ-కామర్స్ సంస్థలు CCPA నోటీసులకు స్పందించకపోయినా, ఆదేశాలను పాటించకపోయినా, వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version