సాధారణంగా ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ చేసిన ఫుడ్ లేదా స్నాక్స్ లలో చిన్న చిన్న పురుగులు లేదా పాడైనటువంటి ఆహారం వచ్చిందని ఫిర్యాదు చేయడం మనం చూస్తుంటాం. కానీ ముంబైలో ఓ మహిళ డాక్టర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే.. అందులో ఏకంగా మనిషి చేతి వేలు దర్శనం ఇచ్చింది. ముంబై లోని మలాడ్ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో తన సోదరితో కలిసి ఐస్ క్రీమ్ తినాలని 3 కోన్ ఐస్ క్రీంలను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టింది. వారు ఆర్డర్ పెట్టిన ది యుమ్మో బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ లను ఆన్ లైన్ డెలివరీ సంస్థ ఇంటికి డెలివరీ చేసింది.
దానిని తినడం ప్రారంభించిన కొద్దిసేపటికే నోటికి ఏదో తగిలినట్టుగా అనిపించింది. వెంటనే పరీక్షించి చూడటంతో కోన్ ఐస్ క్రీంలో 2 అంగులాల మనిషి వేలు కనిపించింది. దీన్ని చూసి ఖంగు తిన్న ఆ మహిళ డాక్టర్ నేరుగా మలాడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై యుమ్మో ఐస్ క్రీం అనే సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వేలును ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. దీనిపై వెంటనే ధర్యాప్తు చేపడతామని.. యుమ్మో ఐస్ క్రీమ్ తయారు చేసే ఫ్యాక్టరీని కూడా సందర్శించి తనిఖీలు చేపడతామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.