నాలుగు రోజులకింద ఢిల్లీలో మహిళా ఎస్సై, రెండు రోజులకింద గుర్‌గ్రామ్‌లో బీజేపీ నాయకురాలు, ఇప్పుడు యూపీలో ఓ అమాయక ఇళ్లాలు. ఇలా ఏదో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో మహిళా ఎస్సైని వ్యక్తిగత కక్ష్యతో తోటి సబ్‌ఇన్‌స్పెక్టరే కాల్చిచంపగా.. గుర్‌గ్రామ్, యూపీలో కట్టుకున్న భర్తలే వారిపాలిట కాలయములయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ పరిధిలోని అజీమ్‌నగర్ ఏరియాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తే ఓ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అసలేం జరిగిందంటే.. సోమవారం సాయంత్రం చిన్న విషయానికే భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి.. ఆవేశంతో అదే ఏరియాలో ఉండే తన అత్తగారింటికి వెళ్లాడు. మీ కూతరుకు డైవర్స్ ఇస్తున్నానంటూ అత్త, మామలకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ తర్వాత తన ఇంటికి తిరుగొచ్చి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.
భర్త ఏం చేస్తున్నాడో అర్థం చేసుకునేలోపే ఆ అమాయకురాలు మంటల్లో కలిసిపోయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారి సాయంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా కాలిపోయిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నది. కాగా పోలీసులు నిందితుడితోపాటు అతని కుటుంబసభ్యులు నలుగురిపై కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.