హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అటు స్పీకర్ కూడా ఈటల రాజీనామాను ఆమోదించారు. దీంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అంతేకాకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగేస్తున్నారు. ఇక ఈటల రాజీనామాతో హుజూరాబాద్ నియోజవర్గానికి ఉపఎన్నిక తప్పని సరి అయింది. ఇప్పటికే అన్ని పార్టీలకు సంకేతాలు కూడా వచ్చాయి. దీంతో హుజురాబాద్‌లో ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఎవరు గెలుస్తారనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
కాగా ఉపఎన్నిక ఎప్పుడూ అధికారంలోకి ఉన్న పార్టీకే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఈసారి జరిగే ఉపఎన్నికను ప్రత్యేకంగా చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈటల రాజేందర్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయనకు బీజేపీ బలం కూడా తోడైంది కాబట్టి ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే సర్వే సంస్థలు హుజూరాబాద్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయట. పట్టణ, గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాయట. 40 శాతం ప్రజలు అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వే సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. 35 శాతం ప్రజలు బీజేపీకి ఓటు వేస్తామని చెబుతున్నారట. కాంగ్రెస్‌కు 20 శాతం ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు సంస్థలు గుర్తించాయట. మరి ఇది ప్రచారం మాత్రమే నిజంగా ఏ పార్టీ గెలుస్తుందనేది తెలియాలంటే ఉపఎన్నిక పోలింగ్ జరిగి ఫలితాలు విడుదలైతే గాని తెలియదు. అప్పటి వరకూ ఆగాల్సిందే తప్పదు.