హైదరాబాద్ వెలుపల ముచ్చర్లలో ఏర్పాటయ్యే ‘ఫోర్త్ సిటీ’లో మరో జూపార్కు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఫోర్త్ సిటీలో 15 వేల ఎకరాలకు పైగా రెవెన్యూ భూమి ఉన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ప్రకృతి పర్యాటకం అభివృద్ధికి జూపార్కుతో పాటు నైట్ సఫారీని ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పర్యాటక ప్రదేశాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో ‘వన్‌తారా’ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. అధికారులు దానిపై అధ్యయం చేస్తున్నారు.
అయితే, ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూపార్కు ఏర్పాటు చేసి, పక్కనే 1000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని గ్రీన్ బెల్టుగా చూపాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. జూపార్కుతో పాటు నైట్ సఫారీ వంటివి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నట్లు అటవీశాఖ వర్గాల సమాచారం.ఇందుకోసం 2 రోజుల కిందట అధికారులు గుజరాత్‌లోని ‘వన్‌తారా’ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. వారి నుంచి రిపోర్టు రాగానే సర్కారు ఆదేశానుసారం పనులు చకచకా సాగనున్నాయి.