విశ్వమానవుడు.. గణతంత్ర విధాత.. పేదల పాలిట పెన్నిధి.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించిన నివాళులు అర్పించింది తెలంగాణ సర్కార్. సాగతీరంలో అంబేడ్కర్ జయంతి రోజున ఆవిష్కృతమైన 125 అడుగుల విగ్రహాన్ని చూసేందుకు ఆదివారం రోజున సందర్శకులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
హుస్సేన్‌సాగర్ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిష్ఠించిన అంబేడ్కర్ మహా ప్రతిమను వీక్షించి సందర్శకులు పులకించిపోయారు. సెల్ఫీలు తీసుకొని.. సంబురపడ్డారు. ఆ మహనీయుడికి మహా విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నగరం నలుమూలల నుంచి సందర్శకులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తరలిరావడంతో ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, నెక్లెస్ రోడ్లన్నీ కిటకిటలాడాయి.
బాబాసాహెబ్ అంబేడ్కర్ కొందరి వాడు కాదని, తన జ్ఞానాన్ని భావితరాలకు అందించి, హక్కులను పంచిన తీరు ఆయన త్యాగాన్ని, పోరాటాన్ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని శాతావాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశ్ తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారని అన్నారు.