ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తాను సైలెంట్ కిల్లర్‌ను కాదని..నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తను అని మంత్రి పేర్కొన్నారు.ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తనకు ఎవరితోనూ పోలిక లేదని, రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని వివరించారు. తమకున్న వనరులతోనే ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. గత పదేళ్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా నెలకు 5 వేల ఉద్యోగాల చొప్పున మొత్తం 50వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
గత ప్రభుత్వం నియామకాలు చేపడితే ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు.తాము అప్పులు చేయట్లేదని, బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని స్పష్టంచేశారు. పెట్టుబడుల విషయంలో కేటీఆర్ చెప్పినవన్నీ తప్పుడు సమాచారం అని, ఐటీ మంత్రిగా గొప్పలు చెప్పుకున్నాడు కానీ..చేసిందేమీ లేదని కేటీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.