సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీలు తీసుకుని పనిచేస్తారని విమర్శించే వారిపై ఆయన అన్న నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి విమర్శలు చేసే వారిని నాగబాబు తీవ్ర పదజాలంతో దూషించారు. ”ఒకప్పుడు చిరంజీవిపై వచ్చిన ఆరోపణల మాదిరిగానే ఇప్పుడు పవన్ కల్యాణ్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. పవన్ ఏపని చేయాలన్నా ప్యాకేజీలు తీసుకునే చేస్తారు. ప్యాకేజీ లేకపోతే పవన్ పనిచేయరు. ప్యాకేజీకి తగినట్టే మాట్లాడి, డబ్బులు అయిపోయాక ప్యాకేజీ ఇచ్చిన వారిని విమర్శిస్తారు..” అని పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు వస్తున్నాయని, ఓ మీడియా ప్రతినిధి ఇటీవలే నాగబాబును ప్రశ్నించగా.. అందుకు నాగబాబు.. తీవ్ర ఆగ్రహంతో సమాధానం ఇచ్చారు.
”పవన్ కల్యాణ్ ప్యాకేజీలు తీసుకుని పనిచేస్తున్నారనే విమర్శలకు నేను సమాధానం చెబుతా.. కానీ నేను మాట్లాడే మాటలకు మీరు బీప్ వేసుకోవాలి. పవన్‌పై ఇలాంటి ఆరోపణలు చేసే వారిని చెప్పుతో కొడతా. కల్యాణ్ బాబు ప్యాకేజీలు తీసుకున్నారా ? ఆయనకు ఆ అవసరం లేదు. వీళ్లు ఇచ్చేది ఆయన సినిమాలు చేస్తే ఒక రోజు సంపాదన కాదు. పవన్ కల్యాణ్ అనుకోవాలే గానీ ఏడాదికి రూ.150 కోట్లు సంపాదించ గల సత్తా ఉంది. ప్యాకేజీలు.. అంటూ కామెంట్ చేసే వారు బాస్టర్డ్స్. వాళ్లని నేను బాస్టర్డ్స్ అనే అంటా..” అంటూ నాగబాబు ఒక రేంజ్ లో తిట్ల దండకం అందుకున్నారు.
”పవన్ టీడీపీతో కలసి పనిచేశారు అనడం తప్పు. ఆయన టీడీపీకి కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు. 2014లో జగన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. జైలుకి వెళ్లి వచ్చాడు. అలాంటి వ్యక్తి కన్నా చంద్రబాబు మేలని అప్పట్లో పవన్ భావించి ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబుతో చాలా విషయాల్లో పవన్ విభేదించారు. ప్రజల సమస్యలపై పోరాడారు. కొన్ని సందర్భాల్లో సీఎం చంద్రబాబును కూడా ఎదిరించారు. అలాంటిది.. పవన్ ప్యాకేజీలు తీసుకుంటారని విమర్శించడం సరికాదని..” నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.