పార్లమెంట్, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడి అధికార పార్టీ టీడీపీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ వలసల పర్వం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా మరో టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నేడు పార్టీ కండువా కప్పుకోనున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. గత కొంత కాలంగా ఆయనకు సొంత పార్టీ టీడీపీలోనే అసంతృప్తి సెగలు వస్తున్న నేపథ్యంలోనే ఆయన పార్టీ మారనున్నట్లు తెలిసింది.
తాను టీడీపీని వీడడం లేదని, సీఎం చంద్రబాబు నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. కానీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టిక్కెట్ ఇవ్వడంపై చంద్రబాబు సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా ఎంపీ రవీంద్రబాబు గత కొద్ది రోజులుగా వైకాపా అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఓ వైపు టీడీపీని వీడేది లేదని ఆయన చెబుతూ వస్తున్నప్పటికీ ఆయన మాత్రం వైకాపాలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇవాళ లేదా రేపు వైకాపా అధినేత జగన్‌ను కలిసి ఆయన సమక్షంలోనే రవీంద్రబాబు వైకాపాలో చేరుతారని సమాచారం. కాగా తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలని, ఆ మేరకు జగన్‌ను కూడా ఎమ్మెల్యే టిక్కెట్ అడగాలని.. రవీంద్ర బాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈరోజు, రేపు వేచి చూస్తేనే కానీ ఈ విషయంలో స్పష్టత రాదు..!