వరంగల్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య మాటలు, సవాళ్ల యుద్ధం కొనసాగుతోంది. దేవనూరు అటవీ భూములను కడియం శ్రీహరి కబ్జా చేశారని రాజయ్య ఇటీవల ఆరోపించారు. దీనిపై కడియం స్పందిస్తూ..దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని కడియం ప్రకటించారు.
ఇక గత ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకంలో రాజయ్య అవినీతికి పాల్పడ్డారని, దానిని తాను నిరూపిస్తే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని మరో సవాల్ విసిరారు. తాజాగా కడియం సవాల్‌ను రాజయ్య స్వీకరించారు. ఎమ్మెల్యే కడియం స్థానికేతరుడని, ఆయన్ను పర్వతగిరికి పంపేవరకు నిద్రపోనన్నారు. ఎంపీ ఎన్నికల్లో కడియం రూ.100 కోట్లకు పైనే ఖర్చు చేశారని ఆరోపించారు. అంతడబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.