పుల్వామా దాడికి ప్రతికారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. దాడుల తర్వాత పాకిస్థాన్ భారత్ పై దాడికి దిగడం.. ఆ తర్వాత భారత యుద్ధ విమానాలు వాటిని తరిమికొట్టడం.. ఆసమయంలో ఐఏఎఫ్ యుద్ధ విమానం పైలట్ అభినందన్ పాక్ కు చిక్కడం.. భారత్ దౌత్యం ఫలించి, ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గి పాక్ అభినందన్ ను తిరిగి భారత్ కు అప్పగించిన విషయం తెలిసిందే.
తాజాగా.. భారత వైమానిక దళం చీఫ్ బీరేందర్ సింగ్ ధనోవా కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది నిజమేనని ఆయన స్పష్టం చేశారు. బాలాకోట్ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్న ప్రశ్నపై ఆయన స్పందిస్తూ… ఎంతమంది చనిపోయారో తాము చెప్పలేమన్నారు. దానిపై వివరణ ఇవ్వాల్సింది ప్రభుత్వమని చెప్పారు. లక్ష్యాన్ని ఛేదించడమే తమ పని అని.. మిగితాదంతా తమకు సంబంధం లేదన్నారు. అయితే.. ఈ మెరుపు దాడుల్లో 200 నుంచి 300 మంది దాకా ఉగ్రవాదులు మరణించి ఉండొచ్చని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది.