”చల్లా ముర్గేష్.. ఓ వ్యాపారవేత్త.. హాస్పిటల్‌కు వెళ్లి వస్తుండగా చలానా విధించారు. కారణం.. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా టూవీలర్‌పై మరొక వ్యక్తితో కలిసి ప్రయాణం చేయడం.. అయితే అందుకు సరైన కారణం కూడా ఉంది. అతను వెనుకాల ఉన్న వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి రిటర్న్ వస్తున్నాడు. వారి వద్ద అందుకు రుజువులు కూడా ఉన్నాయి. కానీ ట్రాఫిక్ పోలీసులు అకారణంగా అతనికి చలానా విధించారు.”
”మహమ్మద్ అస్లాముద్దీన్.. నారాయణగూడ వాసి.. తన కుమార్తెను సమీపంలో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లి అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అతనికి ట్రాఫిక్ పోలీసులు రూ.700 చలానా విధించారు. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నాడని చెప్పి జరిమానా విధించారు. దీంతో అస్లాముద్దీన్‌కు కూడా పోలీసులు అకారణంగానే చలానా వేసినట్లయింది.” అయితే కేవలం వీరిద్దరే కాదు.. ఇలాంటి ఎమర్జెన్సీ ఉన్న ఎందరో రహదారులపై వెళ్తున్నారు. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం కారణాలు తెలుసుకోకుండానే తప్పుగా చలాన్లు వేస్తుండడంతో వాహనదారులు వాపోతున్నారు. అయితే ఇలాంటి సమస్య ఎవరికైనా ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.
వాహనదారులు తమకు పోలీసులు తప్పుగా చలానా విధించారని భావిస్తే.. తమకు సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ చలానా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని.. పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే.. విచారణలో పోలీసులకు రుజువులు చూపించాల్సి ఉంటుంది. అందులో విఫలమైతే మరిన్ని కఠిన చర్యలు ఎదుర్కొనేందుకు వాహనదారులు సిద్ధంగా ఉండాలి. నిజంగా తమపై తప్పుగా చలానా విధించారని అనుకునే వారే ఈ విధంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.