ఆరు గ్యారెంటీ లలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ అందకపోతే ప్రజలు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎమ్మార్వో లేదా ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు చూపించాలని సూచించారు. ఎవరైనా మీకు పథకాలు రావని చెబితే.. ఆ అధికారులను నిలదీసి అడగాలని సీఎం స్పష్టం చేశారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన సభలో రేవంతన్న హామీ ఇచ్చారని ఆ అధికారులతో చెప్పాలని ప్రజలకు ఆయన సూచించారు.
తమ ప్రభుత్వం మంచి చేస్తున్నా.. మెచ్చుకోవాలనే కనీస సంస్కారం బీఆర్ఎస్ నేతల్లో లేదని ముఖ్యమంత్రి రేవంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మేం మంచి చేస్తుంటే ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మా ప్రభుత్వం దిగితే కుర్చీ ఎక్కాలనే ఆలోచనలో వాళ్లు ఉన్నారు అని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర పన్నుతున్నారు. నిరుద్యోగుల గురించి కేసిఆర్ ఎప్పుడూ ఆలోచించలేదు. కుమార్తె, కొడుకు, అల్లుడు పదవుల గురించే ఆలోచించారు’ అని చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.