రాష్ట్ర మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే కరెంట్ కోతల్లేవని, సాగునీటి కొరత లేదని రైతుల ముందుకు వచ్చి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో రైతులు గన్నెబొయిన మల్లయ్య, బోర్ల రాంరెడ్డిని పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రైతుల దుస్థితికి, అవస్థలకి చిహ్నంగా నిలిచిన బోర్ల రాంరెడ్డిని, ఆయన దీన పరిస్థితిని కేసీఆర్ వందల సార్లు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ముషంపల్లికి చెందిన రాంరెడ్డి పేరు బోర్ల రాంరెడ్డిగా మారింది. గన్నెబొయిన మల్లయ్య యాదవ్, బోర్ల రాంరెడ్డి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనసున్న ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. అందుకే మల్లన్నను ప్రత్యేకంగా కలిసేందుకు ఈరోజు ముషంపల్లికి రావడం జరిగింది. రాంరెడ్డి అన్నను కలిసినా, మల్లన్నను కలిసినా, కొంతమంది మహిళలను కలిసినా, గత పది సంవత్సరాలలో ఏ రోజు తాగునీటికి, సాగునీటికి కొరత రాలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయినయ్. తాగునీరు దొరకని పరిస్థితి ఉందని తమ దీనావస్థను చెప్పుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.