రోజంతా కష్టపడి పని చేసిన తర్వాత రాత్రి పడుకోగానే హాయిగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలామందికి అది సాధ్యపడడం లేదు. పడకపై అటు ఇటు దొర్లుతూ, నిద్ర రావాలని ఎదురుచూస్తూ గంటల తరబడి గడిపేస్తున్నారు. కేవలం నిద్రలేమే కదా అని దీనిని తేలికగా తీసుకుంటే మాత్రం ప్రమాదమే. ఎందుకంటే నిద్రలేమి వల్ల కేవలం మరుసటి రోజు అలసట మాత్రమే కాదు, మన శరీరంలోని చాలా వ్యవస్థలపై దుష్ప్రభావం పడుతుంది. మెల్లగా, తెలియకుండానే ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే నిద్రలేమిని నిర్లక్ష్యం చేయకుండా, దీని వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలు ఏవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..
రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మన మెదడు మరియు గుండెపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. వైద్య నిపుణుల ప్రకారం, దీర్ఘకాలిక నిద్రలేమి రక్తపోటు (బిపి) పెరగడానికి దారితీస్తుంది, ఇది భవిష్యత్తులో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.

నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం కణజాలాలను పునరుద్ధరిస్తుంది కానీ నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీనివల్ల టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నిద్ర సరిగ్గా లేని వారిలో ఆకలిని నియంత్రించే హార్మోన్లు మారిపోయి, అనవసరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది.
శారీరక సమస్యలతో పాటు, నిద్రలేమి మానసిక ఆరోగ్యాన్ని కూడా చిన్నాభిన్నం చేస్తుంది. సరైన విశ్రాంతి లేని మెదడు క్రమంగా ఏకాగ్రతను కోల్పోతుంది, దీనివల్ల జ్ఞాపకశక్తి మందగించి నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు మొదలవుతుంది. ఇది కాలక్రమేణా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన (Anxiety) మరియు డిప్రెషన్‌కు దారితీస్తుంది.
శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా క్షీణించి, చిన్నపాటి ఇన్ఫెక్షన్లను కూడా తట్టుకోలేని స్థితికి చేరుకుంటాము. కాబట్టి నిద్రను ఒక విలాసంగా కాకుండా ఆరోగ్యానికి అవసరమైన ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రాత్రిపూట కెఫీన్ తగ్గించడం మరియు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండటం ద్వారా మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు దీర్ఘకాలంగా నిద్ర పట్టకపోవడం లేదా ‘ఇన్సోమ్నియా’ వంటి లక్షణాలు ఉంటే, స్లీప్ స్పెషలిస్ట్ లేదా డాక్టరును సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.
