మహిళలపై పెరిగిన లైంగిక వేధింపులు, ఒత్తిళ్లు..!

-

హైదరాబాద్: దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, ఒత్తిళ్లు నానాటికీ పెరుగుతూనే వస్తున్నాయి. గతేడాది చివరివరకు దేశవ్యాప్తంగా 23,722 మంది మహిళలు జాతీయ మహిళా కమిషన్ (ఎన్.డబ్ల్యూ.సీ)కు ఫిర్యాదు చేశారు. దేశంలో ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. గతంలో కంటే లాక్ డౌన్ లో మహిళలు, యువతులపై వేధింపులు రెట్టింపయ్యాయి. తమకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని కమిషన్ ను వేడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు.

women
women

మహిళల సమస్యలైన లైగింక వేధింపులు, వరకట్నం, సైబర్ క్రైం, కుటుంబ సమస్యలు, న్యాయపరమైన అంశాలపై జాతీయ కమిషన్ ఫిర్యాదులు స్వీకరిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. మహిళల సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. హక్కులను పరిరక్షిస్తోంది. కొన్ని సందర్భాల్లో తానే నిర్ణయం తీసుకుని మహిళలకు న్యాయం కూడా చేస్తోంది. అయితే గత ఆరేళ్లలో ఎన్నడూ లేని విధంగా మహిళల ఫిర్యాదు పెరిగినట్టు జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.

ఉత్తరప్రదేశ్ లోనే అధికం..
2014లో అత్యధికంగా 33,906 ఫిర్యాదు అందాయని ఎన్‌డబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో కేసులు తగ్గినా 2020లో 23,722 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 11,872 ఫిర్యాదు అందాయని పేర్కొంది.

కరోనా సమయంలో..
మొదట్లో కేవలం వరకట్నం, లైంగిక వేధింపులు, తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదు నమోదవుతుండేవి. కానీ ఈ సారి భిన్నంగా గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించే హక్కులకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయని నివేదికలో వెలువరించింది. 2020లో ఈ కోవకు చెందిన ఫిర్యాదులే 7,708 ఉన్నాయంటే అర్థం చేసుకోండి. కేవలం లాక్ డౌన్ లోనే రికార్డు స్థాయిలో 660కిపైగా ఫిర్యాదులు అందాయి.

రాష్ట్రాలవారీగా అత్యధిక ఫిర్యాదులు
ఉత్తరప్రదేశ్ – 11,872, ఢిల్లీ – 2,635, హర్యానా – 1,266, మహారాష్ట్ర – 1,188 కేసులు, ఫిర్యాదులు నమోదయ్యాయి.

2020లో వివిధ విషయాలపై వచ్చిన ఫిర్యాదులు
ఆత్మగౌరవం కల్పించాలని : 7,708
గృహ హింస : 5,294
వరకట్నం : 3,784
మానసిక వేధింపులు : 1,679
పోలీసుల నిర్లక్ష్యంపై : 1,276
లైంగిక దాడి : 1,234
సైబర్ క్రైం : 704
లైంగిక హింస : 376
మొత్తం : 23,722

Read more RELATED
Recommended to you

Latest news