ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్.. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను నేడు.. నగరంలోని జింఖానా గ్రౌండ్లో విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వెల్లడించింది. ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం జరుగుతుందని తెలిపింది.
ఈ నెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్ అభిమానులు ఇవాళ ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏ వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు.
హెచ్సీఏ వైఖరిపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. టికెట్ల గందరగోళంపై రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చితే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామన్నారు. టికెట్లు బ్లాక్లో అమ్మినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టికెట్ల విక్రయాలు పారదర్శకంగా జరగాలని సూచించారు.