దేశంలో శుక్రవారం ఒక్క రోజే 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో యూకేను దాటి భారత్ 4వ స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలలో ప్రస్తుతం నిత్యం అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మరోవైపు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. కరోనా కేసులు జూలై వరకు 5 లక్షలు దాటుతాయని, భారత్‌లో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తికి చేరుకుందని అన్నారు. కానీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆయన వాదనను కొట్టి పారేసింది. భారత్ ఇంకా ఆ దశకు చేరుకోలేదని తెలిపింది.
అయితే నిపుణులు ఈ విషయంపై మాట్లాడుతూ.. భారత్‌లో కంటెయిన్మెంట్ వ్యూహాలు సరిగ్గా పనిచేయడం లేదని అన్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా మార్చి కేసులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ఆ పని వర్కవుట్ అవడం లేదని, అందుకు నిత్యం భారీగా నమోదవుతున్న కేసుల సంఖ్యే ఉదాహరణ అని అంటున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి ప్రారంభమై ఉండవచ్చుననే సందేహాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక కరోనా వ్యాప్తిని ఇప్పుడు అరికట్టలేమని, కానీ.. దాని వల్ల ప్రస్తుతం ఎవరికి ఎక్కువగా ముప్పు ఉందో వారిని గుర్తించి రక్షించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, చిన్నారులు, వృద్ధులకు కరోనా వైరస్ వల్ల ముప్పు ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వారు కరోనా బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల కరోనా మరణాల రేటును తగ్గించవచ్చని అంటున్నారు. అలాగే ప్రస్తుతం కరోనా కేసులు లేని ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టాలని.. అక్కడ కొత్త కేసులు రాకుండా ఉండేందకు గాను ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అంటున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులను ధరించడం, శానిటైజర్లను వాడేలా ప్రోత్సహించడం వంటి పనులు చేయడం వల్ల ప్రజల్లో కరోనాపై మరింత అవగాహన పెరుగుతుందని అంటున్నారు.
ఇక భారీగా పెరుగుతున్న కరోనా కేసులను హ్యాండిల్ చేయడానికి సరిపడా వైద్య సిబ్బందిని, అందుకు అవసరం అయిన మందులు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని కూడా ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో సామూహిక వ్యాప్తి ఉందని, కొన్ని ప్రాంతాల్లో లేదని.. అయినప్పటికీ భారత్ సామూహిక వ్యాప్తికి చేరుకున్నట్లే పరిగణించాలని అంటున్నారు. జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, అప్పటి వరకు ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.