శాస్త్రీయ రంగ పరిశోధనల్లో భారత్- బ్రిటన్ బంధం మరింత బలపడింది. 8 మిలియన్ పౌండ్ల(రూ. 76.94కోట్లు) విలువ గల ఐదు ప్రాజెక్టులపై ఇరు దేశాలు కలిసి పని చేయనున్నాయి. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై పోరాడటానికి ప్రపంచ దేశాలకు ఉపయోగపడే విధంగా యాంటీ మైక్రాబియల్ రెసిస్టెన్స్(ఏఎమ్ఆర్) సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ పరిశోధనలు జరగనున్నాయి.
ఫార్మా పరిశ్రమల్లోని యాంటీ-మైక్రాబియల్ ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ యాంటీ మైక్రాబియల్ తయారీ సమయంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలు ఏఎమ్ఆర్కు ఏ విధంగా ఉపయోగపడతాయన్న అంశాన్ని అర్థం చేసుకోవడమే ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం.
ఈ ఐదు ప్రాజెక్టులు సెప్టెంబర్ నుంచి ప్రారంభంకానున్నాయి. బ్రిటన్ రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ ఫర్ ఇంటర్నాషనల్ కొలాబొరేషన్ నుంచి 4 మిలియన్ పౌండ్లను అందించనుంది బ్రిటన్. తన వనరుల నుంచి 4 మిలియన్ పౌండ్లను ఇవ్వనుంది భారత్. ఈ వివరాలను దక్షిణాసియా- కామన్వెల్త్ మంత్రి లార్డ్ తారీఖ్ అహ్మద్ వెల్లడించినట్టు బ్రిటీష్ హై కమిషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది.