తొలి బహిరంగ సభకు సిద్ధమైన ‘ఇండియా’ కూటమి

-

ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది.

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఢిల్లీ నివాసంలో 14 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ సమావేశమైంది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం సహా పలు అంశాలపై ‘ఇండియా’ బ్లాక్‌ సమన్వయ కమిటీ చర్చించింది. అక్టోబర్‌ మొదటి వారంలో భోపాల్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వంలోని అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఈ పబ్లిక్‌ మీటింగ్‌లో ప్రధానంగా లేవనెత్తనున్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సుమారు 25కుపైగా రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమి పేరుతో ఒకతాటిపైకి వచ్చాయి. కలిసికట్టుగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.

 

అదలా ఉంటే ఇప్పడు తాజాగా నితీష్ కుమార్ అనూహ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శనివారంనాడు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన జి-20 విందు సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయన అడుగులు జోడు పడవల ప్రయాణం వైపుగా పడుతున్నాయా అనే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనూ మాట కలిపారు. బీహార్‌లో బీజేపీతో గత ఏడాది ఆగస్టులో నితీష్ తెగతెంపులు చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన కలవడం ఇదే మొదటిసారి. నితీష్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి పరిచయం చేశారు. బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకున్న ‘ఇండియా కూటమి’ నేతలకు సహజంగానే ఇది మింగుడుపడని వ్యవహరమే. నీతీష్ మంచి రాజనీతిజ్ఞుడని, సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో కాకలు తీరిన నేత అని అందరికీ తెలిసిన విషయమే. జి-20 డిన్నర్‌కు హాజరుకావడం ద్వారా సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం తనకు ఉందని నితీష్ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెప్పకనే చెప్పినట్టు అయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version