దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి గత రెండు నెలల్లో లేని విధంగా భారీ స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్లే నిత్యం 10వేలకు పైగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మాత్రం మనమింకా కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరుకోలేదనే వాదిస్తోంది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కేసులు గతంలో కన్నా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నా.. మనమింకా సామూహిక వ్యాప్తి దశకు చేరుకోలేదని, కనుక భయపడాల్సిన పనిలేదని అన్నారు.
అయితే బలరాం భార్గవ చేసిన వ్యాఖ్యలపై వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎంసీ మిశ్రా, వైరాలజిస్టు షాహిద్ జమీల్, ఊపిరితిత్తుల సర్జన్ డాక్టర్ అరవింద్ కుమార్, ఎపిడెమియాలజిస్టు డాక్టర్ జయప్రకాష్ ములియిల్‌లు స్పందిస్తూ.. మన దేశంలో ముంబై, ఢిల్లీ, చెన్నై తదితర నగరాల్లో ఉన్న అనేక మురికివాడల్లో స్థానికులు ఎక్కడికీ ప్రయాణాలు చేయలేదని, అలాగే వారు విదేశాల నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్ అవలేదని, కానీ ఆయా ప్రాంతాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయని.. ఇది కచ్చితంగా, ముమ్మాటికీ.. సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని చెప్పడానికి
సాక్ష్యమని అన్నారు.
సామూహిక వ్యాప్తి లేకపోతే ఆయా ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా ఎందుకు నమోదవుతున్నాయో.. ఐసీఎంఆర్ చెప్పాలని ఆ వైద్య నిపుణులు ప్రశ్నించారు. సమూహ వ్యాప్తి ఉండబట్టే కేసులు అలా పెరుగుతున్నాయని అన్నారు. ఒకవేళ ఐసీఎంఆర్ చెబుతున్నట్లు అది సమూహ వ్యాప్తి కాకపోతే.. అదేమిటో.. దాన్ని ఏమంటారో వారే కొత్తగా నిర్వచనం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ ఇప్పటికే సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందని, ఆ సత్యాన్ని ఇప్పటికైనా ఐసీఎంఆర్ గ్రహించి ప్రజలను, రాష్ట్రాలను హెచ్చరించాలని అన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రాలు ఐసీఎంఆర్ సూచనలను మాత్రమే పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీఎంఆర్ అనుసరిస్తున్న వైఖరి వల్ల రాష్ట్రాలు, ప్రజలు తప్పుదోవ పట్టేందుకు అవకాశం ఉంటుందని, ఆ ముప్పులోకి ఇంకా వెళ్లకముందే.. ఇకనైనా ఐసీఎంఆర్ మేల్కొనాలని.. దీంతో ప్రజలను కరోనా నుంచి ముందుగానే కాపాడుకునేందుకు అవకాశం లభిస్తుందని.. వైద్య నిపుణులు సూచిస్తున్నారు.