రెండు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. విపక్షానికి చెందిన టీడీపీ నేతలు ఇద్దరు అరెస్టయ్యారు. వారికి బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయి.. కస్టడీలోకి వెళ్లిపోయారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు, అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌లు ఇద్దరూ కూడా జైలు పాలయ్యారు. ఈ క్రమంలో వారు గతంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రభుత్వ అభియోగం. కట్ చేస్తే.. ఈ పరిణామాలు వారికి మాత్రమే పరిమితమా? ఈ రెండు ఘటనల ద్వారా సీఎం జగన్ ఏం చెప్పదలుచుకున్నారు.
ఇప్పుడు ఈ విషయం కీలకంగా మారింది. ఎవరికైనా ఎప్పటికైనా.. ప్రభుత్వాలు శాశ్వతం కాదనే విషయం తెలిసిందే. రెండు సార్లు లేదా మూడు సార్లు లేదా ఐదు సార్లు.. అంతకు మించి ప్రభుత్వాలు ఒకే పార్టీ నీడన కొనసాగే అవకాశం తక్కువే. ఎప్పుడో ఒకప్పుడు పార్టీ అధికారం మారుతుంది. మరీ ముఖ్యంగా ఏపీ వంటి భిన్నమైన రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది. అసలు ఏపీలో ప్రభుత్వాల ఏర్పాటు వెనుక ఉన్న ప్రాతిపదిక ఏంటనేది ఇప్పటికీ సందేహమే. అదే తమిళనాడును తీసుకుంటే.. ఉచితాలు ఎవరు ఎక్కువ ఇస్తే.. వారికి ప్రజలు పట్టం కట్టిన సందర్భాలు ఉన్నాయి.
కేరళను తీసుకుంటే.. నిజాయితీతో వ్యవహరిస్తామని చెప్పే పార్టీలకు కూటములకు ప్రజలు పట్టకడుతు న్నారు. ఒడిసాలో సరైన ప్రత్యామ్నాయం లేక పోవడం, అవినీతి రహిత నాయకుడు ఉండడంతో అక్కడ వరుసగా నవీన్ పట్నాయక్‌ను కూర్చోబెడుతున్నారు. తెలంగాణలో స్థానిక వాదానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి ఏపీలో? దీనికి సమాధానం లభించలేదు. ఈ క్రమంలోనే జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఒకటి నిజాయితీ, రెండు ప్రజల అవసరాలకు నిధులు ఇవ్వడం. దీనికి సంక్షేమం అని పేరు పెట్టి ఉండొచ్చు!
ఈ రెండు పరిణామాలతో జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారనేది కనిపిస్తోంది. ప్రజలు గత ప్రభుత్వాన్ని అవినీతి కారణాలతోనే దింపేశారనేది తెలిసిన విషయమే. సో.. జగన్ దానికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో తన మన అనే తేడా లేకుండా చర్యలు ఉంటాయని ఆయన ఇప్పటికే చెప్పారు. అలానే చేస్తున్నారు. అదేసమయంలో అధికారుల బదిలీల నుంచి అన్నీతానై వ్యవహరిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రజల నాడి పట్టడంలో జగన్ కూడా తలమునకలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.