సౌతాంప్టన్ లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడింది. రెండు ఓటముల అనంతరం మూడో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించినప్పటికీ నాలుగో టెస్టులో భారత్ మళ్లీ చతికిల పడింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. దీంతో 5 టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది.
నాలుగో టెస్టులో 245 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 184 పరుగులకే ఆలౌటయ్యింది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 22 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ కే ఎల్ రాహుల్ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే తొలి డౌన్‌లో వచ్చిన పుజారా (5) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 17. క్రీజులో నిలదొక్కుకుంటున్న సమయంలో మరో ఓపెనర్ ధావన్ (17) అండర్సన్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి కోహ్లీ (58) రహానే (51) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని మొయీన్ విడగొట్టాడు. జట్టు స్కోరు 123 వద్ద కోహ్లీ ఔటయ్యాడు. మరో 4 పరుగుల వ్యవధిలోనే పాండ్యా (0) డకౌటయ్యాడు. రిషబ్ పంత్ (18), ఇషాంత్ శర్మ(0), షమి(8), రవిచంద్రన్ అశ్విన్ (25) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయీన్ అలీ 4, అండర్సన్, స్టోక్స్ చెరో 2, బ్రాడ్, కరన్ తలో వికెట్ పడగొట్టారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 184 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ సిరీస్‌లో చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ఈ నెల 7వ తేదీన జరగనుంది.