చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా భారత్ ఇప్పటికే ఆ దేశంతో ఉన్న అన్ని సంబంధాలను కట్ చేసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో భారత్ ఇటీవల చైనాకు చెందిన హువావే లాంటి కంపెనీలతో 5జి పరికరాల కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. అలాగే చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించారు. ఇక ఇది ఇంతటితో ఆగేలా లేదు. ఎందుకంటే.. ఫార్మా రంగం పరంగా కూడా భారత్ చైనాతో తెగదెంపులు చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే భారత్ ఇప్పుడు చైనాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
చైనా నుంచి భారత్ ప్రతి ఏటా పెద్ద ఎత్తున మెడిసిన్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటోంది. 2018-2019 సంవత్సరానికి గాను మొత్తం రూ.76,303.53 కోట్ల ఫార్మా ముడి పదార్థాలను భారత్ దిగుమతి చేసుకోగా.. అందులో చైనా నుంచి దిగుమతి అయిన ముడి పదార్థాలు 70 శాతం వరకు ఉంటాయి. ఇది చాలా ఎక్కువ. ప్రస్తుతం ఆ దేశంతో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో అక్కడి నుంచి ఫార్మా ముడిపదార్థాలను దిగుమతి చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశంగా ప్రస్తుతం మారింది. అందుకని చైనా నుంచి ఆ ముడిపదార్థాలను దిగుమతి చేసుకోవడం పూర్తిగా ఆపేయాలని భారత్ ఆలోచిస్తోంది.
అయితే చైనా నుంచి ఫార్మా ముడిపదార్ధాల దిగుమతులను ఆపేస్తే దేశంలో ఫార్మా కంపెనీలకు మెడిసిన్లను తయారు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈ క్రమంలో భారత్ ఆ పదార్థాలను చైనా కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. అందుకు భారత్‌కు అమెరికా, ఇటలీ, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. దీంతో చైనా మీద ఫార్మా ముడిపదార్థాల కోసం భారత్ అంతగా ఆధార పడాల్సిన పని ఉండదు.
కానీ.. ఇతర దేశాల నుంచి సదరు పదార్థాలను దిగుమతి చేసుకోవడం కన్నా.. మనదేశంలోనే వాటిని తయారు చేసేలా పరిశ్రమలు పెడితే.. అందుకు ప్రోత్సాహకాలను అందిస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై కేంద్రం ఇప్పటికే ప్రణాళికలు కూడా రచిస్తోంది. అయితే ఇది కార్యరూపం దాల్చి సదరు పరిశ్రమలు ఏర్పాటు అయ్యేందుకు కనీసం ఇంకో 5 నుంచి 8 సంవత్సరాల సమయం పడుతుంది. కనుక అప్పటి వరకు ఆయా దేశాల నుంచి ఆ పదార్థాలను దిగుమతి చేసుకోవడం తప్పనిసరి అయింది. అయితే పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తే.. యాజమాన్యాలకు కావల్సిన అనుమతులను వేగంగా ఇస్తే.. భారత్ కూడా త్వరలో ఫార్మా ముడిపదార్థాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే భారత్ జనరిక్ మెడిసిన్ల తయారీలో ప్రపంచంలో టాప్ దేశాలతో పోటీ పడుతోంది. ఇక ఫార్మా ముడిపదార్థాల పరిశ్రమలు కూడా ఏర్పాటు అయితే.. ఆ అంశంలోనూ భారత్ ప్రపంచ దేశాల సరసన నిలుస్తుంది.