తోటి సీనియర్ ఆఫీసర్, వింగ్ కమాండర్ ఒకరు తనపై లైంగికదాడికి పాల్పడినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా గతేడాది డిసెంబర్ 31న నిర్వహించిన పార్టీ అనంతరం బహుమతి ఇస్తానని రూముకు పిలిచి తనపై లైంగికదాడి చేసినట్లు ఆ మహిళా ఆఫీసర్ తన ఫిర్యాదులో వెల్లడించారు. ముందుగా తాను గదిలోకి వెళ్లగానే ఆయన భార్యా పిల్లల గురించి అడిగానని, దానికి ఆయన స్పందిస్తూ.. ఎక్కడో ఉన్నారులే..అని చెప్పారని గుర్తు చేసుకున్నారని చెప్పారు.
ఆ తర్వాత ఆయన తనను వేధించడంతో పాటు లైంగికంగా బలవంతం చేశాడని ఆరోపించారు. ఇక ఆపాలని ఆయన్ను పలుమార్లు వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అతడిని బలంగా నెట్టేసి తాను గది నుంచి పారిపోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బుద్గాం పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఐఏఎఫ్ అంతర్గత కమిటీ మాత్రం బాధిత ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపణలను ఖండించడం విశేషం.