తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఉప ఎన్నికల రావడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ ప్రకటనలు చేస్తోంది.. ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన వారి పరిస్థితి కూడా అంతేనంటూ కామెంట్స్ చేస్తోంది.. త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికల రాబోతున్నాయని.. క్యాడర్ సంసిద్ధంగా ఉండాలంటూ అగ్ర నేతలు పిలుపునిస్తున్నారు.. ఈ క్రమంలో బిజెపి రూపంలో బిఆర్ఎస్ కు రాజకీయ గండం పొంచి ఉందని ప్రచారం జరుగుతోంది.. బిఆర్ఎస్ కి అభ్యర్థులు దొరుకుతారా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.. గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తుంది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న నేపథ్యంలో.. క్యాడర్ కి ఒక భరోసానిచ్చి.. పార్టీ పటిష్టత కోసం పని చేయించుకుంటుంది.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో దూకుడును ప్రదర్శించిన బిజెపి.. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.. ఇదే సమయంలో ఉప ఎన్నికలు వస్తే మాత్రం.. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను మట్టి కరిపించి.. మెజార్టీ స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది..
బిఆర్ఎస్ పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు బిజెపి పక్క ప్లాన్ తో ముందుకు వెళుతుందన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు మారరు.. జంపింగులకే అవకాశం కల్పించి.. వారిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగిస్తుంది.. కానీ బిఆర్ఎస్ మాత్రం కొత్త అభ్యర్థులను పోటీలోకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఈ క్రమంలో బి ఆర్ ఎస్ అభ్యర్థులను బిజెపి లాక్కునే అవకాశాలూ లేకపోలేదు. బిజెపిలో చేరి పోటీ చేస్తే.. ప్రాధాన్యత దక్కుతుందని, కేంద్ర నుంచి సహకారం ఉంటుందని భావించే నేతలు కచ్చితంగా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు.. కాబట్టి ప్రతిపక్ష బి ఆర్ ఎస్ కు భారతీయ జనతా పార్టీతోనే ప్రమాదం ఉందనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి.. వీటన్నిటినీ అధిగమించి ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎలా సత్తా చాటుతుందో చూడాలి..