కరోనా కట్టడికి కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ప్రస్తుతం లాక్‌డౌన్ 4.0 కొనసాగుతోంది. ఇది మే 31వ తేదీ వరకు ఉంటుంది. అయితే ఆ తరువాత ఏం చేద్దామన్న విషయంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తర్జన భర్జనలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇదే విషయంపై తాజాగా స్పందించారు. లాక్‌డౌన్ ఇంకా పొడిగిస్తే దేశం వినాశనం చెందుతుందన్నారు.
దేశంలో లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ పొడిగింపు వల్ల వైద్య పరమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుందని, లాక్‌డౌన్ ఇంకా పొడిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కరోనా లేని, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతారన్నారు. సమగ్రమైన విధానాన్ని రూపొందించి అందుకు అనుగుణంగా లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని ఆయన సూచించారు.
అయితే మే 31వ తేదీ తరువాత లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా ? పొడిగిస్తే ఇంకా ఎన్ని రోజులు అలా ఉంటుంది ? అన్న విషయంపై ఇప్పటికైతే ఇంకా స్పష్టత రాలేదు. కానీ అందుకు మరో 5 రోజులు మాత్రమే గడువుంది. ఇలాంటి సంకట స్థితిలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా ? అని అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.