ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అయితే ఆయన ప్రవేశపెట్టిన పథకాల కన్నా తప్పుడు పేర్లతో పథకాలను సృష్టించి చాలా మంది ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇంకో పథకం గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.
ప్రధాని మోదీ.. మోదీ లోన్ యోజన.. పేరిట ఓ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆ పథకం కింద భారతీయులు ఎవరైనా సరే రూ.75వేల వరకు లోన్ తీసుకోవచ్చని యూట్యూబ్‌లో ఓ వ్యక్తి వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఇది నిజమే అని నమ్మి చాలా మంది ప్రచారం చేశారు. కానీ ఈ పథకం వట్టిదే అని, దీన్ని కేంద్రం ప్రవేశపెట్టలేదని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తేలింది.
మోదీ లోన్ యోజన పేరిట కేంద్రం ఏ పథకాన్నీ ప్రవేశపెట్టలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడైంది. ఈ మేరకు పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ట్వీట్ చేసింది. అలాంటి పథకాన్ని కేంద్రం లాంచ్ చేయలేదని, అదంతా ఫేక్ అని తేల్చింది. అందువల్ల ఇలాంటి వార్తలను ఎవరైనా చదివితే అసలు ఆ పథకాన్ని ప్రవేశపెట్టారా, లేదా అనే వివరాలను ముందుగా తనిఖీ చేసుకోవడం మంచిది. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది.