భారతీయ రైల్వే మహిళలకు శుభవార్త చెప్పింది. ఇకపై మహిళలు రైళ్లలో మరింత సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకుగాను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారతీయ రైల్వే మేరీ సహేలీ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహిళలు రైలు ఎక్కిన దగ్గర్నుంచీ రైలు దిగే వరకు వారికి ఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది రక్షణగా ఉంటారు.
రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది వారికి తోడుగా ఉంటారు. ఒంటరిగా రైళ్లలో ప్రయాణించే మహిళల వివరాలను వారు ముందుగానే సేకరిస్తారు. అనంతరం కోచ్‌ల వారీగా ఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తుంటారు. ఆ సమయంలో మహిళలు తమకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినా లేదా తమకు అత్యవసర స్థితి ఏర్పడినా కోచ్‌లోనే ఉండే ఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బందిని ఆశ్రయించవచ్చు. లేదా 182 నంబర్‌కు డయల్ చేయవచ్చు.
ఇక మహిళలు రైలు ఎక్కిన దగ్గరనుంచి వారి గమ్యస్థానానికి చేరుకునే వరకు రక్షణ లభిస్తుంది. దీని వల్ల మహిళలు రైళ్లలో మరింత సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. వారికి మరింత భద్రత ఉంటుంది. కాగా ఈ కార్యక్రమాన్ని సౌత్ ఈస్టర్న్ రైల్వే సెప్టెంబర్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రైళ్లలో అమలులోకి తెచ్చింది. దీంతో మహిళలకు రైళ్లలో మరింత రక్షణ లభించనుంది. ఇక రైలు దిగిన తరువాత మహిళల నుంచి ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఫీడ్ బ్యాక్ ను కూడా స్వీకరిస్తారు. రైళ్లలో మహిళల రక్షణకు ఇంకా ఏమేం చర్యలు తీసుకోవాలి, రైలు ప్రయాణంలో ఎంత సురక్షితంగా అనిపించింది.. వంటి ప్రశ్నలను మహిళా ప్రయాణికులను అడిగి ఆర్‌పీఎఫ్ సిబ్బంది తెలుసుకుంటారు. దీని వల్ల మరింత పటిష్టంగా మహిళలకు రైళ్లలో భద్రతను అందించేందుకు వీలు కలుగుతుంది.